అర్హ కోసం రూ. 7 కోట్ల వాహ‌నం.. బ‌న్నీ నిజంగా గ్రేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో సోష‌ల్ మీడియా ద్వారా బాగా పాపుల‌ర్ అయిన ఈ చిన్నారి.. త్వ‌ర‌లోనే `శాకుంత‌లం` వంటి పాన్ ఇండియా చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతోంది. సమంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎపిక్ ల‌వ్ స్టోరీ ఇది.

పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల ప్రేమ గాథ‌ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. ఇందులో అల్లు అర్హ శకుంతల తనయుడు భరతుడి క్యారెక్టర్ ను పోషించింది. ఇప్పటికే బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆక‌ట్టుకుంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనూ అర్హ గురించి అంద‌రూ చాలా గొప్ప‌గా చెబుతున్నారు.

అర్హ పుట్టుకతోనే స్టార్ అని, సెట్ లో మొదటి రోజు వంద మంది మధ్యలో ఉన్నా ఏ మాత్రం భయం లేకుండా నటించింద‌ని, తెలుగు ఎంతో చ‌క్క‌గా మాట్లాడుతుంద‌ని, పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చిన కూడా సునాయాసంగా చెప్పేస్తుంద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో గుణ‌శేఖ‌ర్ చెప్పుకొచ్చారు. ఇక అర్హ కోసం బన్నీ కొన్న (ఫాల్కన్) ఏడు కోట్ల కారావాన్ ని కూడా ఇచ్చేశాడని.. పుష్ప షూటింగ్ లో ఉన్న త‌న కోసం అద్దెకి కారావాన్ తీసుకున్నాడ‌ని ఈ సంద‌ర్భంగా గుణ‌శేఖ‌ర్ చెప్పుకొచ్చారు. అర్హ‌ షూటింగ్ చేస్తునన్ని రోజులు ఎలాంటి కష్టం కలగకుండా బ‌న్నీ చాలా కేర్ తీసుకునేవారని.. కూతురు అంటే ఆయ‌న‌కు ప్రాణ‌మ‌ని గుణ‌శేఖ‌ర్ చెప్పుకొచ్చారు. దీంతో కూతురు విష‌యంలో బ‌న్నీ నిజంగా గ్రేట్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.