NTR అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్… అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ కాంబినేషన్ షురూ!

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ NTR గురించి ప్రస్తావన అవసరం లేదు. నందమూరి వంశంలో అలనాటి Sr NTR తరువాత అదేస్థాయి స్టార్ డంని కొనసాగిస్తున్న హీరో ఎవరన్నా వున్నారంటే అది తారక్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాపైనే తారక్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని అర్ధం అవుతోంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా అందరికీ విదితమే. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ తరువాతి ప్రాజెక్టుని కూడా లైన్లో పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, తారక్ మరో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పాడు. లేటేస్ట్ సమాచారం ప్రకారం తారక్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడని వినికిడి. ఇప్పటికే హను.. ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వినిపించి లాక్ చేసారని టాక్ వినిపిస్తోంది.

కాగా ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను.. తాజా ప్రాజెక్టుని ఎలాగన్నా ఎన్టీఆర్‏తో చేయాలని చూస్తున్నారట. ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి ఆఖరికి సోషల్ మీడియాలో రావడంతో విషయం ఒక్కసారిగా గుప్పుమంది. విషయం తెలిసిన తారక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమా ఒక సైకలాజికల్ లవ్ స్టోరీ అని గుసగుసలు వినబడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అసలు విషయం బయటకు రానుంది.