`గీత ఆర్ట్స్` లో గీత అంటే ఎవ‌రు..? గుట్టు విప్పిన అల్లు అర‌వింద్‌!

అల్లు అరవింద్..టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యుసర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా అల్లు అరవింద్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఇక ఆ తరువాత 1974లో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

అయితే అసలు ఈ గీత ఎవరు? అల్లు ఫ్యామిలిలో గీత అనే పేరుతో ఎవరూ లేరు కదా… మరి ఎవరి పేరుతో ఈ సంస్థను అల్లు అరవింద్ స్థాపించినట్టు? అని చాలామందిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఆలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ కి ఎదురైంది. అల్లు అరవింద్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ గీతా అనేది నా గర్ల్ ఫ్రెండ్ అని చాలామందికి డౌట్ ఉంది.

కానీ వాస్తవానికి గీత ఆర్ట్స్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామని ఒక ప్రపోజల్ పెట్టింది మా  నాన్నగారు అల్లు రామలింగయ్య. భగవద్గీత సారాంశం నచ్చి.. గీత అనే పదాన్ని తీసుకొని ఈ బ్యానర్ కు ఈ పేరు పెట్టినట్టు ఆయన చెప్పారు. అయితే “గీతలో చెప్పినట్టు ప్రయత్నం మాత్రమే మనది.. ఫలితం మన చేతిలో లేదు“ అదేవిధంగా `నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది` అనేది దాని సారాంశం. అలా నాన్నగారు గీత ఆర్ట్స్ పెడదామని అనటం అది నచ్చి ఫైనల్ చేయడం జరిగిందని అరవింద్ పేర్కొన్నారు.

అయితే అప్పట్లో తనకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండడం కూడా నిజమేనని ఆయన తేలిపారు. అయితే వారి ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు బ్యానర్ కి పెట్టారంటూ అల్లు అరవింద్ ని ఆటపట్టించే వారట.. అయితే ఆ రెండు వేరువేరు సందర్భాలు అంటూ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో గీత అంటే ఎవరు అనే విషయంపై ఆలీతో సరదాగా కార్యక్రమంలో గుట్టు విప్పారు. అప్పుడు ఆలీ నవ్వుతూ మరి పెళ్లి తర్వాత అయినా నిర్మల ఆర్ట్స్ అని పేరు మార్చొచ్చు కదా అని అరవింద్ ను అడగగా.. అప్పటికే ఆ బ్యానర్ మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అందుకే పేరు మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు అంటూ అరవింద్ సమాధానమిచ్చారు.