త్వరలో 8 సినిమా రిలీజులున్నాయి.. అయినా ప్రమోషన్స్ లేవే?

టాలీవుడ్ దుమ్ములేపుతోంది. ఇండియాలోనే అగ్రగామి చిత్ర పరిశ్రమగా దూసుకుపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందు, తరువాత అని చెప్పుకోవాలి. జక్కన్న ఎప్పుడైతే పాన్ ఇండియాలో అడుగు పెట్టాడో అక్కడినుండి మన తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇకపోతే జులై నెలలో రిలీజైన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపరచగా.. ఆగస్ట్ మొదటి రెండు వారాల్లోనే మూడు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అందరిలో జోష్ నింపింది. ‘బింబిసార’ ‘సీతారామం’ మరియు ‘కార్తికేయ 2’ వంటి మూడు చిత్రాలు థియేటర్లకు మళ్లీ కళ తీసుకొచ్చాయి.

దాంతో ఇన్నాళ్లూ జనాలు థియేటర్లకు రావడం లేదని భయపడిన ఫిలిం మేకర్స్ అంతా హుషారుగా ఉన్నారు. వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో పలు సినిమాలు రిలీజుకి సిద్ధం అయ్యాయి. ఆగస్టు మూడో వారంలో ఏకంగా 8 సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఈ నెల 18న తమిళ హీరో ధనుష్ హీరోగా నటించిన “తిరు” అనే డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధం కాగా, ఆది సాయి కుమార్ నటించిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమా కూడా ఈ నెల 19న షెడ్యూల్ చేయబడింది.

ఇదే వారంలో బోల్డ్ కంటెంట్ తో ఓ వర్గం ఆడియన్స్ దృష్టిలో పడిన ‘కమిట్మెంట్’ సినిమా రిలీజ్ కానుంది. అలానే ‘వాంటెడ్ పండుగాడ్’ ‘మాటరాని మౌనమిది’ ‘అంఅః’ ‘లవ్ 2 లవ్’ ‘నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా’ వంటి చిన్నా చితకా సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి దూసుకు వస్తున్నాయి. అయితే పేరుకి అర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నా.. అందులో ఒక్క దానికీ ఆశించిన స్థాయిలో క్రేజ్ లేదు. అయితే ఇలాంటి తరుణంలో అంటే బిసార’ ‘సీతారామం’ మరియు ‘కార్తికేయ 2’ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నపుడు సదరు సినిమాలు వాటి ఉనికిని కాపాడుకుంటాయో లేదో చూడాలి మరి.