బాలయ్యను ఫాలో అవుతున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఓ పాట బ్యాలెన్స్ ఉండగా, తాజాగా ఈ సాంగ్ షూటింగ్ కూడా జరుపుకుంది చిత్ర యూనిట్. ఇక మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు ఈ సినిమాలో కనిపిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం మహేష్ బాలయ్యను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఏమిటి.. బాలయ్యను ఫాలో అవ్వడం ఏమిటని అనుకుంటున్నారా.. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో బాలయ్య తన పేరుతోనే అందరినీ డ్యాన్సులు వేసేలా చేశాడు. ‘‘జై.. జై.. జై.. జై.. జై బాలయ్య’’ అనే పాటలో బాలయ్య స్టెప్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ చిందులు వేశారు.

ఇప్పుడు మహేష్ కూడా ఇదే తరహాలో తన పేరుతో డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘మా.. మా.. మా.. మహేషు’’ అంటూ సాగే పాటలో మహేష్ ఇప్పుడు చిందులు వేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాటలో ఈ సాంగ్ పక్కా మాస్ సాంగ్‌గా రాబోతుందని.. ఇందులో మహేష్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన తమ పేరుతోనే ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో బాలయ్యను మహేష్ ఫాలో అవుతున్నట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక మే 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.