కారు దిగనున్న ‘జూపల్లి’..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కారు పార్టీ పట్టించుకోకపోవడంతో ఆయన కినుక వహించినట్లు తెలిసింది. కేసీఆర్‌ పెద్దగా ‍ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన తన అనుచరులు, అభిమానులతో చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ కారు పార్టీ నుంచి బయటకు వచ్చేలా ఉంటే ఏ పార్టీ కండువా కప్పుకోవాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

పార్టీ మారే పరిస్థితే వస్తే తిరిగి కాంగ్రెస్‌ పార్టీనే ఎంచుకుంటే మేలని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీని మాత్రం నిర్ద్వందంగా ఆయన తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే బీజేపీలో ఆయన జిల్లాకు చెందిన డీకే అరుణ యాక్టివ్‌ గా ఉన్నారు. అంతేకాక ఆమె ఇపుడు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా. గతంలో కాం‍గ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో అరుణ, జూపల్లిల మధ్య పొలిటికల్‌ వార్‌ కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో కమలం గూటికి మాత్రం వద్దే వద్దని జూపల్లి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక బీజేపీ కాకుండా మిగిలి ఉన్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీనే. కాంగ్రెస్‌ పార్టీలో చేరితేనే రాజకీయంగా పెద్ద ప్రయోజనం లేకపోయినా కనీసం పరువైనా దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. తన అభిమానుల మద్దతుతో సొంత చరిస్మాతో జిల్లాలో రాజకీయ చక్రం తిప్పవచ్చని అనుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌లో జూపల్లి ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2018లో కొల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హర్షవర్ధన్‌రెడ్డి గులాబీకండువా కప్పుకోవడం జూపల్లికి ఇబ్బందిగా మారింది. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అన్న సామెత ఇక్కడ కచ్చితంగా సరిపోతుంది. హర్షవర్ధన్‌ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తరువాత జూపల్లి ప్రాభవం కారు పార్టీలో తగ్గిపోయింది. స్థానిక ఎన్నికల్లోనూ జూపల్లి బలం చూపించినా పార్టీలో ఆయన తగిన ప్రాధాన్యత లభించలేదు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా జూపల్లిని ఇటీవల కలిసి పార్టీలోకి చేరాలని ఆహ్వానించారు కూడా. జూపల్లి కూడా ఇందుకు సరే అన్నట్లు సమాచారం. ఇదే జరిగితే గద్వాల రాజకీయాల్లో మళ్లీ మార్పులు.. చేర్పులు చోటుచేసుకుంటాయి.