ఇక రాజకీయాల వైపు..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమం‍త్రి నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..యాక్టివ్‌ పాలిటిక్స్‌లో పాల్గొనబోతున్నారు.. ఈ రెండు విషయాలు ఇపుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏపీ శాసనసభలో మాజీ సీఎం చంద్రబాబునాయుడి కుటుంబం గురించి అధికార పక్ష సభ్యులు అగౌరవ పరిచే విధంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ఇంకా కళ్ల ముందు కనపడుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఆ టెంపోను ఇంకా అలాగే కొనసాగిస్తూనే ఉన్నాడు.

తన భార్యను అవమానించారంటూ బాధపడ్డ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు జరపాలని నిర్ణయించారు. అయితే వంశీ క్షమాపణ చెప్పడంతో సభలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని ప్రజలు మరచిపోతున్నట్లున్నారని గమనించిన చంద్రబాబు అప్రమత్తమయ్యారు. నేరుగా తన భార్య, ఎన్టీయార్‌ కూతురు నారా భువనేశ్వరినే రంగంలోకి దించుతున్నారు. ఇటీవల తిరుపతిలో భారీ ఎత్తున వర్షాలు రావడంతో అనేక కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. వరదల్లో సర్వస్వం కోల్పోయారు. దీంతో ఎన్టీయార్‌ ట్రస్ట్‌ ద్వారా 48 కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు నిర్ణయించారు.

అందుకే ఇబ్బంది పడ్డ కుటుంబాలకు రూ. లక్ష అందించారు. ఈ డబ్బును ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ నారా భువనేశ్వరి నేరుగా డిసెంబర్‌ 20న తిరుపతిలో అందించారు. అంటే.. భార్య రాజకీయ అరంగేట్రానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. తండ్రి ఎన్టీయార్‌, భర్త చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసినా ఆమె రాజకీయాలవైపు చూడలేదు. అసెంబ్లీ ఎపిసోడ్‌ అయిన తరువాత ప్రజల్లోకి రావడమంటే రాజకీయాల్లోకి వస్తున్నారనడానికి సంకేతమని పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే 2024లో ఎన్నికల నాటికి భువనేశ్వరి రాజకీయాల్లోకి నేరుగా వస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే నారా వారి కుటుంబంలో అందరూ రాజకీయ నాయకులే అవుతారు.