కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో ఊహించని మార్పులు వస్తాయని.. జనాల్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని అంచనా వేసిన అధిష్టానానికి నిరాశే ఎదురైంది. దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. ఇక హుజూరాబాద్ లో అయితే దారుణం.. కేవలం 3వేల ఓట్లతో సరిపెట్టుకుంది. పార్టీ హైకమాండ్ హుజూరాబాద్ విషయంలో తలంటింది కూడా. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటేచేసేందుకు టీఆర్ఎస్ ఉత్సాహం చూపుతండగా కాంగ్రెస్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది.

అసలు పోటీచేద్దామా..వద్దా అనే విషయాన్ని కూడా తేల్చలేకపోతోంది. పోటీచేస్తే ఒక సమస్య.. చేయకపోతే మరో సమస్య. పోటీచేస్తే కచ్చితంగా ఓటమి పాలవుతాం.. ఇది పార్టీ పరువు తీస్తుంది.. చేయకపోతే కేడర్ నిస్తేజం అయిపోతుంది. వందేళ్ల చరిత్రగల పార్టీ కనీసం పోటీచేసే స్థాయిలో కూడా లేదని పార్టీ శ్రేణులు అనుకుంటారని నాయకులు భావిస్తున్నారు. దీంతో ఏంచేయాలో అర్థం కాక సమావేశాల మీద సమావేశాలు పెట్టి నిర్ణయం మాత్రం వాయిదా వేస్తున్నారు. శనివారం కూడా రేవంత్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. టీ.కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు హాజరై తమ ఒపీనియన్స్ చెప్పారు.. అయితే డిసిషన్ మాత్రం పెండింగ్ పెట్టారు. ఏం చేద్దామంటారు అని డీసీసీ అధ్యక్షులను కూడా అడిగారు. ఈ టాపిక్ పై సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ ఏమన్నారంటే.. ‘‘ఎన్నికల్లో పోటీచేయాలా.. వద్దా అనే విషయాన్ని చర్చించాం.. హైకమాండ్ కు పంపిస్తాం.. ఆ తరువాత నిర్ణయిస్తాం’’ అని శనివారం సమావేశం అనంతరం మీడియాతో పేర్కొన్నారు. ఈ మాటలొక్కటి చాలు వారెంత కన్ఫ్యూజన్లో ఉన్నారో చెప్పడానికి.