ఏకే రీమేక్‌కు అదే టైటిల్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పలు రికార్డులు క్రియేట్ చేసిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలను క్యూలో పెడుతున్నాడు. ఇందులో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’, దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్‌గా ఓ సినిమాతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమాను లైన్‌లో పెడుతున్నాడు.

అయితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరి చూపు మలయాళ చిత్ర రీమేక్‌పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఇటీవల కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వర్కింగ్ స్టిల్స్‌లో పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమాకు టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ అయితేనే పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనంలోకి ఈ పేరు బాగా వెళ్లిపోవడంతో ఈ సినిమాపై మరింత హైప్ తెచ్చేందుకు ఈ సినిమాకు ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా అందాల భామ నిత్యా మీనన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి భీమ్లా నాయక్‌గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రానికి ఏ టైటిల్ పెడతారో తెలియాలంటే రేపటి(ఆగస్టు 15) వరకు ఆగాల్సిందే.