జగన్ సర్కారుపై ఒత్తిడి.. హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్..

స్వాతంత్ర్య దినోత్సవం రోజే గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన యువకుడిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరికొంతమంది అమ్మాయిలు బలవుతారని, అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. రమ్యను హత్య చేసిన క్రిష్ణ అనే యువకుడిని తెలంగాణ పోలీసులు 2019లో దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసినట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు అన్ని రాజకీయపార్టీలు, మహిళా సంఘాలు, విద్యార్థి యూనియన్లు ఎన్ కౌంటర్ చేయాలంటూ సీఎంను కోరుతున్నారు. అలా చేస్తేనే భయముంటుందని, లేకపోతే ఇవి ఇలాగే కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయిని నడిరోడ్డుపై దారుణంగా హత్యచేసే పరిస్థితులు ఉంటే ఇక స్వాతంత్ర్యం అనే పదానికి అర్థం లేదని వాపోతున్నారు. రాష్ట్ర హోం మంత్రి సుచరిత ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి రమ్య కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు ఇచ్చినపుడు కూడా వాడిని ఎన్ కౌంటర్ చేయండి అని పలువురు చుట్టుముట్టి నిలదీశారు. కేవలం పరిహారం ఇస్తే న్యాయం జరుగదు.. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తీసుకున్న చర్యలు మీరూ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా గతంలో ఎన్ కౌంటర్ జరిగిందని, 2008లో స్వప్నిక అనే యువతిపై యాసిడ్ దాడిచేసిన ముగ్గురిని ఎన్ కౌంటర్ చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్ కౌంటర్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం.. పోలీసులు కూడా ఇలా చేయడానికి ఒప్పుకోరు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినపుడు, ప్రభుత్వ మనుగడ కష్టమనే భావన వచ్చినపుడు ప్రభుత్వ పెద్దలు అనధికారికగా పోలీసులకు చర్యలు తీసుకోవాలని చెబుతారు. ఈ నేపథ్యంలో చట్టానికి దొరక్కుండా పక్కా ప్లాన్ తో పోలీసులు ఎన్ కౌంటర్ కథను ముగిస్తారు. ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడూ ఇలాంటివి జరిగితేనే నిందితులకు భయముంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.