ఇప్పటికైనా చెప్పవయ్యా ‘ఐకాన్’ స్టార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి.

ఇక పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో బన్నీ గతంలోనే చేయాల్సిన ఓ సినిమాపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమాను గతంలో అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అప్పట్లో ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కేసింది. దీంతో ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. ముఖ్యంగా దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రాన్ని తీసి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.

దీంతో ఇప్పుడు బన్నీ మళ్లీ వేణుకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడట. అందుకే ఐకాన్ కథను పూర్తిగా రెడీ చేసి తనకు అతి త్వరలో వినిపించాలని సూచించాడట. ఇక దర్శకుడు కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉండగా, ఈ కథకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో బన్నీకి ఈ కథను పూర్తిగా వినిపించి ఓకే చేయించే పనిలో దర్శకుడు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా మన ‘ఐకాన్’ స్టార్ ఈ సినిమా గురించి ఏదైనా తీపి కబురు చెబుతాడా లేడా అనేది చూడాలి.