పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు..!

చమురు కంపెనీలు వాహనదారులకు మరోసారి షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఇప్పటికే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెంచిన ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా పెట్రోల్‌ పై 28 పైసలు, డీజిల్‌ పై 26 పైసలను చమురు కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.93.94 కి చేరింది.

ఇక లీటర్ డీజిల్‌ ధర రూ.84.89కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ క్రాస్ చేసింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.19 ఉండగా డీజిల్ లీటర్ కు రూ.92.17 గా ఉంది. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63 కు, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు చేరింది. ఆమధ్య నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. నిలకడగా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. జూన్ 1వ తేదీన ఒపెక్ దేశాల మంత్రుల భేటీ జరగనుంది. జూలైలో ముడి చమురు ఉత్పత్తి పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఉత్పత్తి పెంచితే, ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.