ఓట‌మి దిశ‌గా మ‌రో ముఖ్య‌మంత్రి..!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానున్న‌దో అనే అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మ‌ళ్లీ అధికార పార్టీల హ‌వానే క‌నిపిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్‌పై క‌న్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమ‌డ దూరంలో నిలిచిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాషాయ పార్టీ 100 మార్క్‌ను కూడా అందుకోవ‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది. ఇక్క‌డ వ‌రుస‌గా మూడోసారి టీఎంసీ అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నా.. నందిగ్రామ్‌లో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వెనుకంజ‌లో ఉండ‌డం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

ఇదిలా ఉండ‌గా అటు అస్సాంలో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రానుంది. ప్ర‌స్తుత ట్రెండ్స్ ప్ర‌కారం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను ఎప్పుడో దాటేసింది. బీజేపీ కూట‌మి 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూపీఏ కూట‌మి 39 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. అయితే రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ‌ర్బానందా సోనువాల్ ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. మాజోలి నుంచి పోటీచేసిన ఆయ‌న ఓట్ల‌లో చాలా వెన‌క‌బ‌డిపోయారు. ఇక త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం సైతం స్వ‌ల్ప మెజార్టీతోనే కొన‌సాగుతుండ‌డంతో గ‌మ‌నార్హం.