పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం

అనుమానం ముందు పుట్టి పోలీస్ త‌రువాత పుట్టాడ‌నే నానుడి. కానీ దేనికైనా ఒక హ‌ద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్కో సారి హాస్యాస్ప‌దంగా మారుతుంటాయి. మ‌రికొన్ని సార్లు అమాయ‌కుల‌ను ఇబ్బందుల పాల్జేస్తాయి. ముందు వెన‌కా చూడ‌కుండా అనుమానం వ‌స్తే చాలు కేసుల‌ను బుక్ చేయ‌డం ఆ త‌రువాత పొర‌పాటు జ‌రిగింద‌ని చేతులు పిసుక్కోవ‌డం వారి అల‌వాటు. తాజాగా పంజాబ్ రాష్ట్ర పోలీసుల చ‌ర్య కూడా అలాగే మారింది. గూడ‌చ‌ర్యం చేస్తోంద‌నే సాకుతో ఏకంగా ఒక పావురంపై కేసు ఫైల్ చేశారు. ఇప్పుడిది సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లే..

పంజాబ్ లో పాకిస్తాన్ తో ఉన్న‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ మధ్య నలుపు, తెలుపు రంగులతో ఉన్న‌ పావురమొకటి ఎగురుకుంటూ భార‌త్‌లోకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ దానిని చూశాడు. తీక్ష‌ణంగా ప‌రిశీలించ‌గా దాని కాళ్లకు ఓ తెల్లని కాగితమొకటి గ‌మ‌నించి షాక్ తిన్నాడు. దానిని పట్టుకోవడమే కాదు ఆ సమాచారాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్ కి తెలియజేశాడు. ఆయ‌న కూడా ఇదేదో అనుమానాస్పదంగా ఉందని, ఇది గూడచార పావురమై ఉండవచ్చునని అమృత్ సర్ లోని పోలీసులు కూడా భావించారు. అంతే ఆ పావురంపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. అయితే ఇంతకీ ఆ తెల్లకాగితంలో ఏముందో అన్న విషయం తెలియక‌పోవడం కొస‌మెరుపు. 2020 లో కూడా ఇలాగే మే నెలలో జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లా వద్ద ఓ పావురాన్ని గ్రామస్థులు పట్టుకోవ‌డం, అధికారులు అది గూఢచర్యంలో భాగ‌మ‌ని భావించ‌డం, తుద‌కు అది తన పెంపుడు పావురమని, దాన్ని అప్పగించాలని పాక్ వాసి ఒకడు అధికారులకు విన్నవించుకోవ‌డం విశేషం.