అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు…?

కరోనాను కట్టడి చేసేందుకు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు. గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరమన్నారు. ఆడిటోరియం‌లు, రెస్టారెంట్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా థియేటర్ల సీటింగ్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆయన తెలిపారు. కాగా.. శుక్రవారం నాడు ఢిల్లీ పాజిటివిటీ రేటు అనూహ్యంగా 24 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెంచుతోందని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇకపోతే పాజిటివిటీ రేటు 32 శాతానికి పైగా కొనసాగుతోంది.

మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రులలో బెడ్లు దొరికే పరిస్థితులు లేవు. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 19 రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. ఇది ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది. తాజాగా లాక్‌డౌన్ పొడిగింపుపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనుంది. ఢిల్లీలో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు తెలుస్తోంది. కేసుల తీవ్రతను చూస్తున్నట్లైతే కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగించేందుకు సన్నద్దమవుతోందనే తెలుస్తోంది.