ప‌వ‌న్‌తో కేటీఆర్‌ `సెల్ఫీ` … వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులు

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప‌వ‌ర్ స్టార్ న‌టించిన కాట‌మ‌రాయుడు చిత్రాన్ని చూసిన సంద‌ర్భంగా.. కేటీఆర్, ప‌వ‌న్‌తో సెల్ఫీ దిగి.. ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో ప‌వ‌న్ చేసిన ప్ర‌సంగాల వ‌ల్ల ఆయ‌న‌పై కొంత వ్య‌తిరేక‌త ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆయ‌న కుటుంబంపైనా ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్‌తో సెల్ఫీ దిగి పెట్టడంపై తెలంగాణ వాదులు సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే ఈ సెల్ఫీ ప‌వ‌న్‌కు మంచే చేసింద‌ని, తెలంగాణవాదుల నాడి తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుందంటున్నారు!

మోక్షానికి వెళ్తే మొస‌లి ఎత్తుకుపోయింద‌ని సామెత‌! కేటీఆర్ కి ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే అనుభ‌వంలోకి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించి కాట‌మ రాయుడు చిత్రం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మంత్రి కేటీఆర్ సెల్పీ దిగిన సంగతి కూడా తెలిసిందే. అయితే, ఇప్పుడీ సెల్ఫీపై నెటిజ‌న్లు మండిప డుతున్నారు. కొంత‌మంది తెలంగాణ వాదులు ఈ సెల్ఫీపై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఒక్క‌సారి గ‌తం గుర్తు చేసుకుంటే.. తెరాస నేత‌లు అంటే చాలు, ప‌వ‌న్ అగ్గిమీద గుగ్గిలం అయిన రోజులు చాలానే ఉన్నాయి.

గ‌తాన్ని కేటీఆర్ మ‌ర‌చిపోతే ఎలా అంటూ కొంత‌మంది నెటిజ‌న్లు మంత్రి కేటీఆర్ ను సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ వాదాన్ని అంతగా వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ తో ఇలా సెల్ఫీలు దిగ‌డం స‌రికాద‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే, కేటీఆర్ సెల్ఫీ దిగింది వేరే కార‌ణంతో అనేవారూ ఉన్నారు. కాట‌మ రాయుడు సినిమా ద్వారా ప‌వ‌న్‌ చేనేత‌ల్ని బాగా ప్రోత్సహించారని. ఎలాగూ కేటీఆర్ కూడా చేనేత మంత్రి కావ‌డంతో, ఇలా సెల్ఫీ దిగ‌డం త‌ప్పులేద‌ని కొంత‌మంది వాదిస్తున్నారు. ఈ సెల్ఫీ నేప‌థ్యంలో తెలంగాణ నెటిజ‌న్ల నుంచి వ్య‌క్త‌మౌతున్న అభిప్రాయాల్ని జ‌న‌సేన అధినేత గ‌మ‌నించాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

వ‌చ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన పోటీకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప‌ల్స్ ఎలా ఉందో, జ‌న‌సేన మార్చుకోవాల్సింది ఏంటో ఒక్క‌సారి విశ్లేషించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అలాంట‌ప్పుడు, ప‌వ‌న్ మీద‌గానీ, జ‌న‌సేన పార్టీపైగానీ ఈ ప్రాంతం నుంచి వ్య‌క్త‌మవుతున్న ప్ర‌తీ అభిప్రాయాన్నీ కౌంట్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ సెల్ఫీ విష‌యంలో కేటీఆర్ ను నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నా.. ప‌రోక్షంగా ప‌వ‌న్ పై వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త‌ను తెలుసుకోవాలి. మరి తెలంగాణ విష‌యంలో ప‌వ‌న్ ఏ స్టాండ్ తీసుకుంటారో వేచిచూడాల్సిందే!!