మోడీ మేనియా:పెళ్లి ఆగిపోయింది!

వరకట్నం వల్ల పెళ్లి ఆగిపోవడం చూశాం. లవ్ ఎపైర్ల వల్ల ఆగిపోవడం విన్నాం. చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు నిలిచిపోవడం మనకు తెలుసు. కానీ ప్రధాని మోడీ వల్ల పెళ్లి ఆగిపోయిందంటే నమ్ముతారా. కానీ ఆ పెళ్లితో మోడీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ పెళ్లి మాత్రం ఆయన కారణంగానే ఆగిపోయింది. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా.. ఐతే ఈ స్టోరీ చదవండి.

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు.. ప్రభుత్వ ఉద్యోంగం చేస్తున్న యువతికి పెళ్లి కుదిరింది. పెళ్లి లాంఛనాలు, ఖర్చుల గురించి, చేయాల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకునేందుకు రెండు కుటుంబాల పెద్దలు సమావేశమయ్యారు. అంతా శుభం జరగాలన్న కోరికతో ఓ గుళ్లో కలుసుకున్నారు. ఈ సమావేశానికి వెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా వచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఖర్చుల గురించి మాట్లాడుకుంటుండగా ప్రధాని మోడీ టాపిక్ వచ్చింది. మోడీ పాలనలో దేశం ఎలాంటి ఆర్ధికాభివృద్ధి సాధించలేదని.. పేదల పరిస్థితి అస్సలు మెరుగుపడలేదని వధువు అన్నది. దీంతో వరుడికి చిర్రెత్తుకొచ్చింది. అతను మోడీ అభిమాని కావడంతో వధువుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసింది. అదే కోపంలో అభిప్రాయాలు కలవనప్పుడు పెళ్లి అనవసరమంటూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న పెద్దలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తతంగం చూసిన పెద్దలంతా ఇదేంట్రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు. సో మోడీ ఆ విధంగా పెళ్లి చెడగొట్టారన్నమాట.