జెంటిల్ ఉమన్ డ్రీమ్ రోల్స్ ఏంటో తెలుసా!

‘జెంటిల్‌మన్’ సినిమాతో హీరో నానితో సమానంగా నివేద థామస్ మార్కులు కొట్టేసింది. ఈ మలయాళి అమ్మాయి మనకు కొత్తే అయినా మాలీవుడ్-కోలీవుడ్‌లకు ముందుగానే పరిచయం. కొన్ని సినిమాలతో అక్కడి ప్రేక్షకులను అలరించి… దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిలో పడి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. సహజ నటన అంటే ఇష్టమని చెప్తున్న నివేద.. పాత్ర బాగుంటే రెండో కథానాయికగానైనా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని అంటోంది.

ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నివేద మంచి పేరే తెచ్చుకుంది. కథ వింటున్నప్పుడే ‘తప్పకుండా చేయాలి’ అనిపిస్తే సదరు సినిమా ఒప్పుకుంటానని లేకుంటే లేదని అంటోందీ చిన్నది. ఇక ఈమె డ్రీమ్ రోల్స్ జాబితా పెద్దగానే ఉంది. ఉదాహరణకు సైకో, బిచ్చగత్తె, అమాయకురాలు లాంటి ప్రాతల్లో మెప్పించాలని అనుకుంటోంది. అన్నట్టు నివేదకు తెలుగు బాగానే వచ్చు. ‘జెంటిల్‌మన్’కు తనే డబ్బింగ్ చెప్పాలనుకుందట కానీ పరీక్షల వల్ల కుదరలేదట. నివేదకు పరీక్షలేంటనా మీ సందేహం? ఆమె చెన్నైలో ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తోంది. చదువు-నటన రెండూ ముఖ్యమే అని.. ఒకదాని కోసం మరొకటి వదులుకోలేనని అంటోందీ బ్యూటీ.