మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం నిన్న అలా ప్రారంభమైందో లేదో అప్పుడే టైటిల్‌పై కాంట్రవర్సీ వచ్చేసింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లోగో లాంచ్ చేశారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడుగా పిలుస్తారు.
నాడు ఉయ్యాలవాడ, చాగలమర్రి, కోవెలకుంట్ల ప్రాంతాల్లో బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడిన ధీరుడిగా ఉయ్యాలవాడ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సైరా నరసింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ముందు నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్‌ను అనుకున్నా చివర్లో ఏం జరిగిందో ఏమో గాని సైరా అనే టైటిల్ పెట్టి నరసింహారెడ్డిని క్యాప్షన్‌గా మార్చేశారు.
అయితే ఈ టైటిల్‌పై ఉయ్యాలవాడ వారసులు ఆగ్రహంతో ఉన్నారు. తమ కుటుంబ పెద్ద అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడే తాము పూర్తి పేరును సినిమా పేరుగా పెడితే ఒప్పుకుంటామని చెప్పాం. కాని ఇప్పుడు ఆ పేరును కాకుండా వేరే పేరును పెట్టడం ఏంటని వారు చిరుపై ఫైర్ అవుతున్నారు. చిరుకు ఇది తగునా ? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
చిరు అండ్ కో వెంటనే సైరా టైటిల్‌ను ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మార్చకపోతే తాము దీనిపై కోర్టుకు వెళతామని వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. మరి దీనిపై ఈ చిత్ర టీం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ? చూడాలి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ హిస్టారికల్ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది.