బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ సీజన్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన హఠాన్మరణాన్ని అభిమానులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ శుక్లా కేవలం 40 ఏళ్లకే మరణించడం సంచలనంగా మారింది.
మరోవైపు ఈయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునే శుక్లా… డైలీ వర్కవుట్స్, ఎక్సర్ సైజెస్ తో బాడీని ఫుల్ ఫిట్ గా ఉంచుకుంటాడు. పైగా చిన్న వయసు. అటువంటి సిద్ధార్థ్‌కి హార్ట్ అటాక్ రావడమేంటి? అంత సడన్ గా చనిపోవడం ఏంటీ? ఇలా ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సిద్ధార్థ్ శుక్లా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
సిద్ధార్థ్ శుక్లా మృతదేహానికి శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. దీనికోసం ప్రత్యేకంగా ముగ్గురు డాక్టర్లను నియమించారు. అయితే పోస్ట్‌మార్టమ్ అనంతరం.. సిద్ధార్థ్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు తమ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. ఇక అతని అంతర్గత అవయవాలను విశ్లేషిస్తే.. మృతికి కారణమేంటన్నది తెలుస్తుందని, ఇప్పటికే వీటి నమూనాలను విశ్లేషణ కోసం పంపించామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. హిస్టోపాథాలజీ జరిపిన తర్వాతే మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అంటున్నారు.