తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!

September 3, 2021 at 11:23 am

అరవయ్యేళ్లు దాటిపోయేవరకు పార్టీకి యువనేతగానే మిగిలిపోయిన స్టాలిన్.. ఈ వయసులో దక్కిన ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఒక మోడల్ అనిపించేలాగా.. నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే.. మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల ఇళ్లకు వెళ్లి పలకరించి.. ప్రభుత్వానికి సహకరించమని అడగడం దగ్గరినుంచీ.. నిన్న మొన్న ఎన్నికలకు ముందు స్కూలు పిల్లలకోసం అప్పటి సీఎం బొమ్మలతో తయారుచేసిన బ్యాగులపై బొమ్మలు మార్చే పనిలేకుండా.. ప్రభుత్వానికి అదనపు ఖర్చు పడకుండా.. వాటినే సరఫరాచేసేయమని చెప్పడం, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తనని పొగిడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం ఇవన్నీ కూడా.. ఇతర ముఖ్యమంత్రులు స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు.

ఇలాంటి రాజకీయ మర్యాదల విషయంలో మాత్రమే కాదు. విధాన నిర్ణయాల పరంగా కూడా… స్టాలిన్ తన ముద్రని నిరూపించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే నిరసించడంలో ఆయన ముందంజలోనే ఉంటున్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో తమిళనాడు వ్యతిరేక దృక్పథంతోనే ఉంటుందనే విషయాన్ని ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి.. తాజాగా… ప్రభుత్వ రంగ సంస్థలను ప్రెవేటీకరించడం అనే అంశం హాట్ హాట్ గా నడుస్తోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా నోరు మెదపలేదు. అయితే ఈ పద్ధతి చాలా తప్పు అని అసెంబ్లీలోనే తేల్చిచెప్పిన స్టాలిన్ ఈమేరకు పీఎస్‌యూలను ప్రెవేటీకరించే ఆలోచనను వ్యతిరేకిస్తూ త్వరలో కేంద్రానికి లేఖ రాస్తానని కూడా ప్రకటించారు. ఈ ప్రెవేటీకరణ చేపట్టడానికి నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ (ఎన్ఎంపీ) అనే కొత్త పద్ధతిని మోడీ సర్కారు తాజాగా తీసుకువస్తోంది. దీనిపట్ల ఆర్థికవేత్తలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం మొత్తాన్నీ ప్రెవేటు రంగానికి తాకట్టు పెట్టేసే కుట్రగా పలువురు దీనిని అభివర్ణిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆలోచనలోని లోతుపాతులను పరిశీలించి.. అభిప్రాయాలు చెప్పాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంటుంది.

కానీ తెలుగురాష్ర్టాల పరిస్థితి చూస్తే ఇక్కడి ముఖ్యమంత్రులు గానీ, పార్టీల వారు గానీ మోడీని ధిక్కరించి నోరు మెదిపే పరిస్థితిలో లేరు. జగన్ మోడీ ప్రాపకం కోసం తహతహలాడిపోతున్న సంకేతాలు స్పష్టంగానూ కనిపిస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబునాయుడు ఏకంగా మోడీ భజన చేయడం పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలోనూ పరిస్థితి భిన్నమేం కాదు. కేసీఆర్ అడపాదడపా మోడీని నాలుగు మాటలు తిట్టాల్సిందే తప్ప.. కేంద్రం కీలకంగా భావించే బిల్లులు, నిర్ణయాల విషయంలో తన వ్యతిరేకతను స్పష్టీకరించడం లేదు. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రెవేటు వారికి కట్టబెట్టే నిర్ణయం పట్లనైనా తమ వ్యతిరేకత తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్టాలిన్ బాటలో నడవాల్సిన అవసరమూ ఉంది.

తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!
0 votes, 0.00 avg. rating (0% score)