తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సుప్రీం కోర్ట్ గడప కూడా తొక్కడంతో భవిష్యత్తులో ఈ పరిణామం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా పక్కా లెక్కలతో బీఆర్ఎస్ కు చరిత్ర గుర్తు చేస్తోంది.
గతంలో జరిగిన తప్పులను, అడవులను నరికిన అంశాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ లెక్కల ప్రకారం చూస్తే, లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం గానూ కేవలం మూడేళ్ళలో 8 వేల ఎకరాల అడవులను నరికి చదును చేసారు. ఇందులో దాదాపు 12 లక్షల వృక్షాలను నరికేశారు. మరి అక్కడ ఉండే వన్య ప్రాణుల మాట ఏంటీ అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఇదే సమయంలో.. హరిత హారం విషయంలో కూడా కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ లెక్కలు బయటపెడుతోంది.
2015 నుండి 2022 వరకు ఏడేళ్ళలో హరితహారం కార్యక్రమం కింద 219 కోట్ల మొక్కలు నాటారు. ఈ మొక్కలలో 85 శాతం బతికాయని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఇక ఇందుకోసం 9,777 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నాటి ప్రభుత్వం. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అలాగే అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించి ఈ మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటించారు. గ్రామ పంచాయితీలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటారు. ప్రమోషన్లు కూడా గట్టిగానే జరిగాయి.
కెసిఆర్ లెక్కల ప్రకారం అన్ని మొక్కలు బతికితే అటవీ విస్తీర్ణం భారీగా పెరగాలి. కాని 2021 నివేదికల ప్రకారం తగ్గింది. 21,591 చ.కి.మీ 2014లో ఉండగా, 2021 నాటికి 21,213 చ.కి.మీలకు తగ్గిపోయింది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో.. బీఆర్ఎస్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా అటవీయేతర ప్రయోజనాల కోసం కేటాయించారు. అప్పుడు కూడా చెట్లను పెద్ద ఎత్తున నరికారు. ఆ సమయంలో కూడా ఎవరూ మాట్లాడలేదు. ఇక లక్షల ఎకరాలను వేలం ద్వారా విక్రయించారు. అప్పుడు పర్యావరణ వేత్తలు గాని బీఆర్ఎస్ సోషల్ మీడియా గాని అది తప్పు అని చెప్పకపోగా ప్రమోషన్లు చేసారు. మరి కెసిఆర్ చేసింది అభివృద్ధి అయితే రేవంత్ చేసేది ఏంటీ అంటూ కాంగ్రెస్ నిలదీస్తోంది.