టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏపి డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్లను పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే వీరమల్లు మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా.. తాజాగా అది వాయిదా పడింది. మరోవైపు పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే అభిమానుల్లో టెన్షన్ మొదలైందట. కాగా.. వీరమల్లు సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్న జ్యోతికృష్ణ ఇప్పటికే ఆయన లేని సన్నివేశాలను షూట్ చేసి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
కాస్త ప్యాచ్ వర్క్ ఉన్నా ఐదు రోజులు పవర్ స్టార్ డేట్స్ ఇస్తే చాలు.. సినిమాను పూర్తి చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారట టీం. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ చివరి వారం లేదా.. మే ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకన్నా సినిమాకు ఆలస్యం అయితే జూలైకి వస్తుంది. ఈ క్రమంలోనే వీరమల్లు పనులు పూర్తయి.. ఆ సినిమా రిలీజ్ అయితే తప్ప ఓజీకి విముక్తి లభించదు. ఈ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ షూట్ పార్ట్ ఎక్కువ బ్యాలెన్స్ లేదు. కానీ.. రెండు సినిమాలను సమాంతరంగా బ్యాలెన్స్ చేయడానికి పవన్‌కు కుదరడం లేదు.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌కు ఈ ఏడాదిలో మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి రైట్స్ భారీ మొత్తం అమ్మేసినట్లు తెలిసింది. ఒకవేళ 2026 కి సినిమా రిలీజ్ వెళ్లాల్సి వస్తే.. ఒప్పుకున్న మొత్తంలో నిర్మాత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే.. దసరా లేదా దీపావళికి అది కుదరకుంటే.. క్రిస్మస్ కైనా ఓజీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు సినిమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడంతో అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాల విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడని.. ఏ నెలలో ఏ సినిమాకు ఎన్ని డేట్స్ ఇవ్వాలో ఫిక్స్ చేయనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.