టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కానీ.. ఈ సన్నివేశం కారణంగానే మా జీవితాలు నాశనమయ్యాయి అంటూ ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని.. వెల్లడించాడు. తాజాగా ఓ ఫోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న గురువారెడ్డి.. అసలు ఆ సీన్ రాసింది ఎవరో తెలియదు గానీ.. డాక్టర్ వృత్తికి పెద్ద నష్టం చేకూర్చారంటూ చెప్పుకొచ్చాడు. సినిమా మొత్తం లో అదో పెద్ద వరస్ట్ సీన్ అని అది చూసిన ఎవరైనా సరే డబ్బుల కోసం పేషెంట్ ని ఐసిఏ లో తీసుకెళ్తున్నారని భావిస్తున్నారని.. పొరపాటున పేషెంట్ చనిపోతే దానికి డాక్టర్లు కారణం కాదని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.
ఇక చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్.. ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ సందర్భంలో ఠాగూర్ లోని ఈ హాస్పిటల్ సీన్ గురించి ఆయనతో మాట్లాడా. మీరు చేసిన ఠాగూర్ హాస్పిటల్ సీన్ డాక్టర్లకు మనశ్శాంతి లేకుండా చేసిందని వెల్లడించా. అయితే ఈ సీన్ అంతకుముందు ఇంకా దారుణంగా ఉందని.. తర్వాత చిరంజీవి గారు దాన్ని కాస్త మార్పు చేపించి నటించారని డాక్టర్ గురువారెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం గురువారెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.