బోయపాటి – బాలకృష్ణ కాంబోలో నాలుగో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా కానుకగా ఈ సినిమా పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో పండగే. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు దక్కించుకున్నాయి. ఇక వీటిలో 2021లో రిలీజ్ అయిన అఖండ అయితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. దీనితో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో దసరా కానుకగా బీబీ 4 రన్నింగ్ టైటిల్‌తో మరో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసారు మేకర్స్.
తాజాగా ఆ సినిమా టైటిల్ను రిలీజ్ చేశారు. అఖండ తాండవం పేరుతో అఖండ సిక్వెల్ రూపొందనుంది. ఈ టైటిల్ పోస్టర్ను ప్రొడక్షన్ బ్యానర్ వారు సోషల్ మీడియా వేదికగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్నో ట్విస్ట్‌లతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా డిజైన్ చేశారు. శివలింగం, రుద్రాక్షలు, హిమాలయాలు ఇలా అన్ని అంశాలను జోడిస్తూ బాలకృష్ణ మాస్ అవతారం రానుందని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఇక బాలకృష్ణను ఎలివేట్ చేయడంలో బోయపాటి ఎప్పుడూ ముందుంటారు. దీంతో ఈ సినిమాలో బాలయ్యను బోయపాటి ఏ విధంగా చూపిస్తారో.. ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో అని ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది.
ఇక బోయపాటి, బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పకురాలుగా ఈ సినిమాకు బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇటు బాలయ్య.. అటు బోయపాటికి కూడా ఈ సినిమా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేసింది. హిందీలో డబ్ చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీన్ని సీక్వెల్‌ను పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.