నాని సినిమాల‌కు లాభాలుండవ్.. వైర‌ల్ గా మారిన స్టార్ ప్రొడ్యూస‌ర్ ట్వీట్‌!

ఇటీవ‌ల ద‌స‌రా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `హాయ్ నాన్న‌` మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ డిసెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే నిన్న హాయ్ నాన్న టీజ‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నాని చాలా ఓపిగ్గా స‌మాధానాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఓ రిపోర్ట‌ర్..`మీ సినిమాలు హిట్ అయినా నిర్మాత‌ల‌కు లాభాలుండ‌వ్ అనే టాక్ ఉంది. ఈక్రమంలోనే మీ జెర్సీ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదని కామెంట్స్ వినిపించాయి. మీరు ఏమంటారు` అని ప్ర‌శ్నించగా.. అందుకు నాని `ప్రొడ్యూసర్స్ అన్ని లెక్కలు బయటకి చెప్పారు కదా సార్. జెర్సీ 10కి 50 రూపాయిలు తెచ్చిపెట్టింది` అంటూ పేర్కొన్నాడు.

ఇక ఇదే విష‌యంపై జెర్సీ నిర్మాత నాగవంశీ కూడా స్పందించాడు. `సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించిన అద్భుత‌మైన‌ మరియు లాభదాయకమైన చిత్రాలలో జెర్సీ ఒకటి. ఈ సినిమాకు మాకు జాతీయ స్థాయిలో గుర్తింపును మరియు అంతులేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది. నేను ఆర్ధికంగా, క్రియేటివ్ పరంగా జెర్సీ మూవీ విష‌యంలో చాలా సంతోషం అనుభవించాను` అని ట్వీట్ చేసి నానికి సపోర్ట్ అందించారు నాగ‌వంశీ. అదే స‌మ‌యంలో స‌ద‌రు రిపోర్ట‌ర్ కు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో నాగవంశీ ట్వీట్ కాస్త వైర‌ల్ గా మారింది.