మొన్న సితార‌.. నేడు గౌత‌మ్‌.. జాతిర‌త్నాలు రా మీరు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరో మాత్ర‌మే రియ‌ల్ హీరోగా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. వంద‌లాది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయించి వారి గుండె చ‌ప్పుడు అవుతున్నాడు. అయితే మ‌హేష్ బాబు బాట‌లోనే ఆయ‌న పిల్ల‌లు కూడా న‌డుస్తున్నారు.

చిన్న‌త‌నం నుంచే త‌మ గోల్డెన్ హార్ట్‌ను బయ‌ట‌పెడుతూ అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇటీవ‌ల మ‌హేష్ కూతురు సితార త‌న బ‌ర్త్‌డేను `మహేష్ బాబు ఫౌండేషన్` ద్వారా చ‌దువుకుంటున్న అమ్మాయిలతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంది. అనంతరం ఆ బాలికలందరికి సైకిళ్ళను బహుమతిగా ఇచ్చింది. అయితే నిన్న గౌత‌మ్ బ‌ర్త్ డే. గౌతమ్ కూడా తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా జ‌రుపుకున్నాడు.

తన సొంతూరు బుర్రిపాలెంలోని పిల్లలను కలుసుకొని.. వారి మధ్య త‌న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నాడు. కేక్ కటింగ్ అనంత‌రం గౌత‌మ్‌ వారికీ స్పోర్ట్స్ కిట్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చాడు. అలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న కొంతమంది విద్యార్థులకు హియరింగ్ మెషిన్ కూడా అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను మ‌రియు ఫోటోల‌ను గౌత‌మ్ తో పాటు అత‌ని త‌ల్లి న‌మ్ర‌త సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో నెటిజ‌న్లు మ‌హేష్ బాబు పిల్ల‌లపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నిజంగా జాతిర‌త్నాలు రా మీరు అంటూ సితార‌, గౌత‌మ్ ల‌ను ఉద్ధేశిస్తూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.