మహేష్ బాబు బర్త్‌డే సినీ చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఏర్పాట్లు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న 48వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అంటే ఈ వేడుకలకు ఇంచుమించు ఇంకొక నెల రోజుల సమయం ఉంది. కాగా ఇప్పటినుంచే ఫ్యాన్స్ మహేష్ బాబు నుంచి గొప్ప ట్రీట్ కావాలని డిమాండ్స్ వినిపిస్తున్నారు. వారి కోరిక మేరకు దర్శక నిర్మాతలు సైతం ఈ టాలీవుడ్ ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లో మంచి హిట్ అయిన బిజినెస్‌మేన్‌ రీ-రిలీజ్ చేయాలని సమాలోచనలు చేస్తున్నారట.

ఈ సినిమాని మామూలుగా కాకుండా 4K వెర్షన్‌లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ సినిమాతో ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేస్తూ పండగ వాతావరణం నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెలలో మహేష్ నుంచి ఏ కొత్త సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. దీనివల్ల థియేటర్స్‌కి వచ్చి అభిమానులు సందడి చేసే అవకాశం ఉండదు. అదే బిజినెస్‌మేన్‌ రీరిలీజ్ చేస్తే వారందరూ థియేటర్లకి వచ్చి మహేష్ బాబు పుట్టినరోజు ఆనందంగా థియేటర్లో కూర్చొని అతని సినిమా చూసే అవకాశం ఉంటుంది.

అలాగే ఫ్యాన్స్ అంతా థియేటర్లలో కలిస్తే వచ్చే ఆనందమే వేరు. ఇకపోతే 2012లో తొలిసారిగా రిలీజ్ అయిన బిజినెస్‌మేన్‌ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మహేష్ తో రొమాన్స్ చేసింది. యాక్షన్ కామెడీ సాంగ్స్ మ్యూజిక్ ఇలా అన్ని ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా ఇది ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించింది. అయితే ఈ మూవీ రిలీస్ చేస్తే ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు మహేష్ బాబు బర్త్‌డే సినీ చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ఏర్పాట్లు ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.