`పుష్ప 2` నుంచి క్రేజీ డైలాగ్ లీక్ చేసిన బ‌న్నీ.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి చివ‌రిగా వ‌చ్చిన చిత్రం `పుష్ప: ది రైజ్‌` ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో బ‌న్నీ డీగ్లామ‌ర్ లుక్ లో న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు కొన‌సాగింపుగా పార్ట్ 2 `పుష్ప: ది రూల్‌` రాబోతోంది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న పుష్ప 2 వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంద‌ని అంటున్నారు. అయితే తాజాగా పుష్ప 2 నుంచి బ‌న్నీ ఓ క్రేజీ డైలాగ్ ను లీక్ చేశారు. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `బేబీ` మూవీ టీమ్ ను అభినందించ‌డానికి అల్లు అర్జున్ ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం సాయంత్రం ఈ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్ లో బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా బ‌న్నీ అభినందించారు. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య అద్భుతంగా న‌టించింద‌ని.. ఆమెకు ఈ ఏడాది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావాల్సిందే అని బ‌న్నీ తెలిపారు.

ఇక స్పీచ్ అయిపోయిన అనంతరం బ‌న్నీ వెళ్లిపోవ‌డానికి రెడీ అవుతుండ‌గా.. ఫ్యాన్స్ అంతా పుష్ప 2 డైలాగ్ చెప్ప‌మంటూ గోల గోల చేశారు. అందుకు బ‌న్నీ స్పందిస్తూ.. `పుష్ప 2 డైలాగ్ కావాలా? ఇప్పుడు లీక్ చేయాలా.. అమ్మో ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ గా ఉంది. నేను చెప్తా అనుకోలేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమా పేరు పుష్ప 2 : ది రూల్.. ఇక్కడ జరిగేది మొత్తం ఒక రూల్ ప్రకారం జరుగుతున్నాది, అదే పుష్ప గాడి రూల్` అంటూ బ‌న్నీ డైలాగ్ లీక్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. బ‌న్నీ లీక్ చేసిన డైలాగ్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.