కమెడియన్ సుధాకర్ కొడుక్కి భారీమొత్తంలో సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి!

కమెడియన్ సుధాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. నేటి జనరేషన్ కి చెప్పాలేమోగాని నిన్నటి జనరేషన్ కు పరిచయం చేయాల్సిన పని లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన స్టార్ హీరో మాత్రం కాలేకపోయారు. దాంతో కమెడియన్ సుధాకర్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. “అబ్బబ్బా.. టేచల్ టేచల్” లాంటి డైలాగులు ఆయన్ను మరో లెవల్ కి తీసుకు వెళ్లాయి. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు.

అయితే, గత కొంత కాలంగా ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం ఏం బాగాలేదు. ఈ క్రమంలోనే మొన్న ఓ ఛానెల్ లో నిర్వహించిన ఈవెంట్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు చిరంజీవి చాలా మంచి మిత్రుడు. నా తర్వాత నా కొడుకు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ బాధ్యతలు మొత్తం చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నాడు. త్వరలోనే చిరంజీవి చేతులు మీదుగానే నా కొడుకు గ్రాండ్ ఎంట్రీ ఉండబోతోంది.” అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు సుధాకర్.

ఇంకా ఆయన మాట్లాడుతూ… గతంలో కూడా నా కొడుకు కాలేజీ సీటు విషయమై చిరంజీవి ఎంతో హెల్ప్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆయన సాయం చేయబోతున్నాడు. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోవడం కష్టం… అంటూ కన్నీళ్లు పెట్టాడు సుధాకర్. ఇకపోతే అప్పట్లో చిరంజీవి, సుధాకర్ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసినదే. వీరిద్దరూ కలిసిన నటించిన సినిమాలు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టాయి. అప్పటి బంధాన్ని దృష్టిలో పెట్టుకొని స్నేహితుడికి చిరు ఈ సాయం చేయబోతున్నాడన్నమాట.