ఏకంగా సింహాన్ని దత్తత తీసుకున్న నటుడు.. ఎవరో తెలుసా?

కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ గురించి అందరికీ తెలిసినదే. ఈ మధ్య కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు శివకార్తికేయన్. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌ సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. అవును, ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు శివకార్తికేయన్‌కి జేజేలు కొడతారు. విషయంలోకి వెళితే, తాజాగా చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (వండలూర్ జూ) నుంచి ఓ సింహాన్ని దత్తత తీసుకున్నాడు శివ. మూడేళ్ల వయసున్న ఈ సింహం పేరు షెరు. ఈ ఏడాది మే నెలలో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్ పార్క్ నుంచి ఈ సింహాన్ని తీసుకొచ్చారు. ఆరు నెలల పాటు సింహం సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇక 6 నెలల పాటు సింహం సంరక్షణ కోసం సుమారు సుమారు 75,000 రూపాయిలు మన హీరో జూ నిర్వాహకులకు చెల్లించాడు. షేరు సింహం దత్తత తీసుకోవడంపట్ల జూ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక అదే జూ కి చెందిన ప్రకృతి అనే ఏనుగును కూడా గతంలో 6 నెలలపాటు ఈ నటుడు దత్తత తీసుకున్న సంగతి విదితమే. అంతేకాకుండా 2020లో కూడా ఓ తెల్లపులిని శివకార్తికేయన్ దత్తత తీసుకున్నాడు. ఏడాదిపాటు దాని సంరక్షణ కోసం రూ. 2.15 లక్షలు చెల్లించాడు.

దాంతో మూగ జీవాల సంరక్షణ బాధ్యతలు తీసుకొంటున్న శివకార్తికేయన్‌ మంచి మనసుని పలువురు ప్రముఖులు అభిమానిస్తున్నారు. నటుడు శివకార్తికేయన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మావీరన్‌లో నటిస్తున్నాడు. ఈ మువీ జూలై 14న విడుదల కానుండడంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ మువీ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ నిర్మిస్తున్న మరో చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నారు. ఈ హీరోకి కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగునాట కూడా మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం కోలీవుడ్లో దూసుకుపోతున్న నటుల్లో శివకార్తికేయన్‌ ఒకరు.