పెళ్లి పీట‌లెక్క‌బోతున్న `ద‌స‌రా` డైరెక్ట‌ర్‌.. అమ్మాయి ఎవ‌రంటే?

ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో దసరా ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టిస్తే.. దీక్షిత్ శెట్టి, స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ‌, షైన్‌ టామ్‌ చాకో, సాయి కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మార్చి 30న విడుద‌లైన ఈ రా అండ్ ర‌స్టిక్ ఫిల్మ్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త వ్యక్తి టాలీవుడ్ కు దర్శకుడుగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించాడు. అయితే త్వ‌ర‌లోనే శ్రీ‌కాంత్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల వివాహం అత‌డి సొంత జిల్లా కరీంనగర్ లో జరగనున్నట్టు తెలుస్తోంది.

హడావిడి లేకుండా చాలా సింపుల్ గా శ్రీ‌కాంత్ వివాహం చేసుకోబోతున్నాడ‌ట‌. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతికొద్ది మంది అథితులతో ఇత‌గాడి వివాహం జరగనుందని తెలుస్తోంది. ద‌స‌రా టీమ్ తో పాటు సుకుమార్‌, బుచ్చిబాబు వంటి వారు శ్రీ‌కాంత్ పెళ్లికి హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు. ఇక శ్రీ‌కాంత్ ఓదెల పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు ఇంత వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అయితే బంధువుల అమ్మాయితోనే అత‌డు ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. కాగా, ప్ర‌స్త‌తుం శ్రీ‌కాంత్ అల్లు అర్జున్ `పుష్ప 2` మూవీ కోసం వ‌ర్క్ చేస్తున్నాడు.