వావ్, వాటే కాంబో.. ఫరియా అబ్దుల్లాతో అల్లరి నరేష్ సినిమా!!

అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న ఉగ్రమ్ సినిమా ఈ ఏడాది ఎండాకాలంలో విడుదల కానుంది. ఇంతలోనే ఈ అల్లరి హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. తొలిసారిగా మల్లి అంకంతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతుందట. చాలా కాలం తర్వాత నరేష్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కనిపిస్తున్నాడని తెలియడం ఇప్పుడు చాలామందిని ఖుషి చేస్తోంది.

కితకితలు, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జి, బెండ్ అప్పారావ్ ఆర్ఎంపి, దొంగల బండి వంటి అల్లరి నరేష్ సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అలాంటి సినిమాలు తన్నుంచి మరిన్ని రావాలని ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక తీర్చడానికి అల్లరి నరేష్ సిద్ధం అవ్వడంతో అభిమానులు సంతోషపడుతున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో నరేష్ సరసన హీరోయిన్‌గా ఫారియా అబ్దుల్లాను ఖరారు చేశారు. ఫరియా జాతి రత్నాలుతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతోనే ఈ తారా మంచి కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించింది. అలాగే తన సొట్ట బుగ్గల తో ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. మొత్తం మీద నరేష్, ఫరియాల కాంబినేషన్ స్క్రీన్ పై నవ్వులు పూయించనుందని తెలుస్తోంది. అయితే ఇది రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదని అంటున్నారు. మల్లి వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేయనున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. సూర్య సినిమాటోగ్రఫీ చూసుకుంటారు. అత్యంత శుభప్రదమైన ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మేకర్స్. అంతేకాదు, ఈరోజు ఓపెనింగ్ పూజా ముహూర్తం కూడా నిర్వహించారు. త్వరలోనే ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.