ఒక్క రోజులో 7 సార్లు భోజ‌నం.. కొమ‌రం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ అన్ని నెల‌లు క‌ష్ట‌ప‌డ్డాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చ‌ర‌ణ్‌, కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌ల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాతాలో ఇటీవ‌ల అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్‌ చిత్రం ఆస్కార్ దిశగా ఉరకలు వేస్తోంది. దీంతో ద‌ర్శ‌కుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు అమెరికాలో `ఆర్ఆర్ఆర్‌`ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్‌.. కొమ‌రం భీమ్ కోసం తాను ప‌డిన క‌ష్టాన్ని వివ‌రించాడు.

ఆర్ఆర్ఆర్‌ కోసం ఫిట్ నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని.. కొన్ని నెలల పాటు ఒకే తరహా శరీరాకృతి కొనసాగించాలని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే రోజులో 3000 క్యాలరీలు పెంచుకోవాల్సి వచ్చిందని.. అందుకోసం ఒక్కరోజులో ఏడుసార్లు భోజనం చేశాన‌ని ఎన్టీఆర్ తెలిపారు. ఇక 16 నుంచి 17 నెలలు కష్టపడి కొమరం భీమ్ లుక్ లోకి వచ్చానని జూనియర్ తెలిపారు. ఈ సినిమా మమ్మల్ని గర్వపడేలా చేసిందని.. త‌మ‌ కష్టానికి మంచి ఫలితాన్ని అందించిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడు