యశోద ఫస్ట్ గ్లింప్స్.. అదిరింది!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలోనూ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది. కాగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటించిన సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక తన నెక్ట్స్ చిత్రాలపై సమంత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఇక మరో థ్రిల్లర్ మూవీ ‘యశోద’లోనూ సమంత లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో సమంత ఓ బెడ్ పై నుండి లేచి కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. అక్కడ ఓ పావురాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. కట్ చేస్తే.. ఆమె ఉన్నది ఓ జైలులో అని మనకు చూపిస్తూనే చిత్ర టైటిల్‌ను చూపిస్తారు చిత్ర యూనిట్.

చూడబోతుంటే, ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీలా ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు హరి, హరీష్‌లు దర్శకత్వం వహించగా, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న యశోద ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.