తారక్ కోసం బాలీవుడ్ పాపను దించుతున్నారా?

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక తారక్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే తన 31వ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా షికారు చేస్తోంది.

తారక్ 31వ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు ఈ కన్నడ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయబోతున్న ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ బ్యూటీని దించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే అయితే తారక్ లాంటి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్‌కు సరైన జోడీగా ఉంటుందని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. అటు దీపికా క్రేజ్‌తో ఈ సినిమాను నార్త్‌లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసుకోవచ్చని వారు ఆలోచిస్తున్నారు. మరి నిజంగానే తారక్ కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికాను బరిలోకి దించుతారా లేక ఇదంతా కేవలం పుకారుగానే మిగులుతుందా అనేది చూడాలి.