మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే బన్నీ స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అతడి కెరీర్ మొదలైనప్పటి నుంచి బన్నీ వెనకాల చిరంజీవి అండగా నిలబడ్డారు. అల్లు అర్జున్ కు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని గౌరవం ఉండేది. అలాగే చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలు అందరితోనూ ఎంతో సఖ్యతగా మెలిగేవాడు బన్నీ. కానీ కొన్నేళ్లుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి మెల్లమెల్లగా దూరం అవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి.
జులాయి ఆడియో ఫంక్షన్ లో..ఎక్కడైతే అరుపులు, కేకలు ఉంటాయో అక్కడ పవన్ కళ్యాణ్ వుంటాడని.. పొగిడిన బన్నీ పవన్ ఫ్యాన్స్ మరింత కేకలు పెట్టేలా ప్రోత్సహించాడు. అయితే సరైనోడు హిట్ తర్వాత అల్లు అర్జున్ స్వరంలో మార్పు వచ్చిందని అంతా అంటుంటారు.సరైనోడు విజయోత్సవ సభలో అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని కేకలు పెట్టడంతో ‘ చెప్పను బ్రదర్’ అని కామెంట్ చేశాడు. అలా కేకలు పెట్టొద్దంటూ అభిమానులకు ఓ క్లాస్ తీసుకున్నాడు.
ఆ తర్వాత నిహారిక,నాగశౌర్య జంటగా నటించిన ఒక మనసులో సినిమా ప్రమోషన్స్ లో కూడా చెప్పను బ్రదర్.. అంటూ బన్నీ మరోసారి పవన్ అభిమానులకు క్లాస్ తీసుకున్నాడు.అప్పటి నుంచి అల్లు అర్జున్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతోంది.
ఈ ఘటన తరువాత అప్పటివరకు ఓన్లీ మెగా ఫ్యాన్స్ గా ఉన్న అభిమానులు..మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ గా విడిపోయారని చెప్పొచ్చు.తిక్క మూవీ ఫంక్షన్ లో సాయి ధరంతేజ్ మాట్లాడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేకలు పెట్టడంతో.. ఈ ప్రేమే నాకు కావాలి.. అంటూ ఫ్యాన్స్ మరింత కేకలు పెట్టాలని ఎంకరేజ్ చేయడంతో పవర్ స్టార్ నినాదాలు మారుమోగాయి. అప్పట్లో తేజ్ బన్నీకి కౌంటర్ ఇచ్చాడని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు కామెంట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మా ఎన్నికలు జరుగగా.. చిరంజీవి వర్గానికి వ్యతిరేకంగా మోహన్ బాబు, బాలకృష్ణ ఫ్యామిలీలు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే అల్లు అరవింద్ బాలకృష్ణ హోస్ట్ గా ఆహా యాప్ లో అన్ స్టాప్ అబుల్ అనే ప్రోగ్రాం ప్రారంభించారు. ఆ ప్రోగ్రాం తొలి గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ని ఇన్వైట్ చేశారు.
ఆ తర్వాత అఖండ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వెళ్ళాడు. ఇవన్నీ మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. అప్పట్నుంచి సోషల్ మీడియా వేదికగా అల్లు ఫ్యామిలీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ మధ్య రగడ తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఎవరు హిట్ కొట్టినా అల్లు అరవింద్ పార్టీ ఇవ్వడం ఈ మధ్య జరుగుతోంది. విజయం అందుకున్న వారిని ప్రోత్సహిస్తూ ఆయన, అల్లు అర్జున్ కలసి పార్టీలు ఇస్తుంటారు. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.