విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వెంకటేష్.. ఇప్పటికీ సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు.
ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటితో 61 వ పడిలోకి అడుగుపెట్టాడు వెంకీ. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 టీమ్ వెంకీకి బర్త్‌డే విషెస్ తిలియజేస్తూ ఆయన అభిమానులకు అదరిపోయే ట్రీట్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రమే `ఎఫ్ 3`.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డబ్బు నేపథ్యంలో సాగుతున్న చిత్రమిది. అయితే వెంకీ బర్త్‌డే సందర్భంగా.. ఎఫ్ 3 సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
చార్మినార్ సెంటర్లో పరుపు వేసుకుని కరెన్సీ కాయితాలతో విసురుకుంటున్న సుల్తాన్ లుక్ లో వెంకటేశ్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రంలో వెంకటేష్ రేచికటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ నత్తి ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.