హైదరాబాద్ లో వివాహితపై గ్యాంగ్ రేప్.. బలవంతంగా మద్యం తాగించి దారుణం..!

మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్భయ, దిశ వంటి ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ.. చివరకు అత్యాచారాలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నప్పటికీ కామాంధులు చెలరేగు తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాదులో 25 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఒక కళాశాల సమీపంలో ఈ ఘటన జరిగింది.

కొందరు దుండగులు ఓ మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు మహిళకు కూడా బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు నగదును ఎత్తుకెళ్లారు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది.