గని కోసం బాల్రెడ్డి బాగా కష్టపడ్డాడట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సినిమాల్లో లైగర్, గని లాంటి చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాల్లో గని చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్‌గా కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో మరో నటుడు కూడా బాక్సింగ్ చేస్తూ కనిపించనున్నాడు.

తెలుగులో క్యారెక్టర్ పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ తనదైన మార్క్ వేసుకున్న యాక్టర్ నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన చేసిన సినిమాలు ఆయన నటన గురించి మనకు చెబుతాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో బాల్రెడ్డిగా నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ పీక్స్. ఇక ప్రస్తుతం గని చిత్రంలో వరుణ్‌తో పాటు తాను కూడా బాక్సింగ్ చేస్తూ కనిపిస్తానని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం శ్రీకాంత్ అనే బాక్సింగ్ కోచ్ దగ్గర మూడు నెలల పాటు ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడట ఈ యాక్టర్.

అయితే నవీన్ చంద్ర ఫ్యామిలీలో నిజమైన ప్రొఫెషనల్ బాక్సర్ ఉన్నారని, ఆయన్ను చూసి తాను కూడా అటువైపు వెళ్లాలని అనుకున్నా, తన తల్లి మాత్రం చదువులపై దృష్టిసారించమని చెప్పిందంటూ నవీన్ చంద్ర అన్నారు. ఏదేమైనా గని చిత్రంలో వరుణ్ తేజ్‌తో పాటు మరో బాక్సర్‌ను మనం చూడబోతున్నామని ఈ యాక్టర్ చెప్పుకొచ్చాడు.