హుజూరాబాద్ ఓటర్లకు లేఖలు రాస్తున్న టీఆర్ఎస్ పార్టీ

’’గౌరవనీయులైన ఓటరు గారికి.. మేము చేపట్టిన సంక్షేమ పథకాలు చూడండి.. ఓటేయండి..‘ అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇపుడు లేఖలు రాయబోతోంది. ఓటర్లకు పార్టీలు ఎప్పుడైనా లేఖలు రాయడం విన్నారా.. ఓటర్లే పార్టీలు, నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడం చూశాం కానీ.. మొత్తం నియోజకవర్గ ఓటర్లందరికీ లేఖలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఎటు పోయి ఎటు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అరె.. ఉప ఎన్నికలకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారేంటి అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ మాకు తెల్వద్.. మేము గెలవాలంతే.. అని పార్టీలు భావిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను హుజూరాబాద్ లో దింపింది. నియోజకవర్గం మొత్తం పర్యటనలు చేస్తూ కారుకు ఓటేయాలని నాయకులు కోరుతున్నారు. తాము చేపట్టిన పథకాలు చెబుతూనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే లేఖలు రాయాలని నిర్ణయించింది హైకమాండ్. అందులో దళిత బంధు గురించి గొప్పగా చెప్పాలని నిర్ణయించింది. ఆ పథకానికే పెద్దపీట వేస్తూ పబ్లిసిటీ చేయాలని డిసైడ్ అయ్యారు. గత ఏడేళ్లలో చేపట్టిన డెవలప్ మెంట్ ను కళ్లకు కట్టినట్టు వివరించనున్నారు. రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విదేశీవిద్యా నిధి లాంటి అనేక కార్యక్రమాల గురించి చెప్పాలని భావిస్తోంది. రెండు లక్షల మందికి ఈ లేఖలు పంపాలని, అదీ సీఎం పర్యటనకు ముందే ఈ లెటర్లు వారిని చేరేలా కారు పార్టీ పక్కా ప్లాన్ వేసింది. మరి ఈ లేఖల కారును ఎంత స్పీడుగా తీసుకెళతాయో చూడాలి.