సోనూ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..?

సినిమాలో రాక్షసుల్లా కనిపించే విలన్లకూ మంచి మనసుంటుందని నిరూపించాడు నటుడు సోనూసూద్‌. అయితే కరోనాకు ముందు వరకు అంద‌రి దృష్టిలో సోనూసూద్ విల‌న్‌గానే ప‌రిచ‌యం. కానీ కరోనా ఎప్పుడైతే ఎంట‌ర్ అయిందో ఆయ‌న ప్ర‌పంచానికే హీరో అయ్యాడు. ఎంతోమందికి చేయూతనందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ నేనున్నానంటూ దేవుడయ్యాడు.

ప్రభుత్వాలు చేయలేని పనులను సోనూసూద్ ఒక్క‌డ ఒంటి చేత్తో చేస్తుండటంతో ప్ర‌పంచ‌మే ఆయ‌న‌కు స‌లాం కొడుతోంది. ఈ క్రమంలో పలువురు సోనూసూద్ అభిమానులు ఆయ‌న‌ను క‌లిసేందుకు పాదయాత్రలు కూడా చేశారు. అయితే తనను కలవడానికి పాద‌యాత్ర‌లు చేయొద్ద‌ని సూచించారు. అయినా సరే తనతో కలిసి సెల్ఫీ దిగాలని ఎంతోమంది ఎక్క‌డి నుంచి ముంబైకి వ‌చ్చి ఆయ‌న‌తో సెల్ఫీ దిగుతున్నారు. తాజాగా మరో అభిమాని సోనూసూద్‌ను కలిశాడు. విశేష‌మేమిటంటే 1200 కి.మీ. సైకిల్‌ తొక్కుకుంటూ సోనూసూద్ ఇంటికి వ‌చ్చాడు. ఈ విష‌యం తెలుసుకున్న సోనూసూద్‌ అతడిని సాద‌రంగా ఆహ్వానించాడు. అభిమాని ప్రేమతో సోనూసూద్ పాదాల మీద పూలు చల్లాడు. నటుడి మెడలో పూల‌దండ వేయబోతుండగా సోనూసూద్ దాన్ని తీసుకొని అభిమాని మెడలో వేసి నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వెబ్‌లో వైరల్‌గా మారింది.