సోనూసూద్ ప్రధాని అవ్వాలి: బాలీవుడ్ నటి

ఆపత్కాలంలో గొప్ప పనులు చేస్తున్న సోనూసూద్ పై సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోనూసూద్ రియల్ హీరో అంటూ పొగిడిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు, సెలబ్రెటీలు.. ఇండియాకి సోనూసూద్ ప్రధాని మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణి హుమా ఖురేషీ కూడా సోనూసూద్ ప్రధాని కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సోనూసూద్ ఎలక్షన్లలో తప్పకుండా పోటీ చేయాలని నేను అనుకుంటున్నా. ఎన్నికలలో నిలబడితే ఆయనకే నేను ఓటు వేస్తాను. అతను ప్రధాన మంత్రి కావాలి” అని ఆమె వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆమె వ్యాఖ్యలపై స్పందించిన సోనూసూద్.. “ప్రధాని అవ్వాలని అనడం కాస్త ఎక్కువే కానీ ఇది హుమా ఖురేషీ మనసుకు నిదర్శనం. నేను ప్రధానమంత్రి హోదాకి అర్హుడని ఆమె అనుకున్నారంటే నేను కచ్చితంగా మంచి పని చేసే ఉంటానని భావిస్తున్నాను. కానీ ఆమె వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఒక సమర్థవంతమైన ప్రధాన మంత్రి ఉన్నారని భావిస్తున్నాను. అలాంటి బాధ్యతలు మోయడానికి నేను చాలా చిన్నవాడినని భావిస్తున్నాను. రాజీవ్ గాంధీ 40 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు కానీ అప్పుడు పరిస్థితులు వేరు. నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొందరికి ఇష్టం లేదు. అందుకే వారిని కలత పెట్టాలని అనుకోవడం లేదు. నా పని నేను చేసుకోవడం నాకు ముఖ్యం. ఒక నటుడిగా నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను” అని అన్నారు.