హ‌న్సిక 50వ‌ సినిమాకు అడ్డంకులు..ద‌ర్శ‌కుడే అలా చేశాడ‌ట‌!

హ‌న్సిక 50వ చిత్రం మ‌హా. జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో హ‌న్సిక మాజీ ప్రియుడు శింబు కూడా కీల‌క పాత్ర పోషించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కింది. మంచి అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది.

కానీ, క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇంత‌లోనే దర్శకుడు జ‌మీల్ మాత్రం సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

సినిమాలో కొంత భాగాన్ని త‌న‌కు తెలియ‌కుండా, స‌హాయ ద‌ర్శ‌కుడి సాయంతో కంప్లీట్ చేశార‌ని, త‌న‌కు రెమ్యున‌రేష‌న్ చెల్లించ‌లేద‌ని, ఎడిటింగ్ కూడా త‌న ప్ర‌మేయం లేకుండా జ‌రిగింద‌ని జ‌మీల్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీంతో కేసును విచారించిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని చిత్ర‌ నిర్మాతను ఆదేశిస్తూ తదుపరి వాయిదాను మే 19కి వాయిదా వేశారు.