సినిమాల్లో అన్న‌య్య‌.. రాజ‌కీయాల్లో తమ్ముడు

టాలీవుడ్ టాప్ హీరోలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య ఎప్పుడూ ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండేది. ఇటీవ‌ల సంక్రాంతి బ‌రిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజ‌కీయాల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పోటీగా మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాల‌య్య బ‌రిలో ఉండ‌టం, ఆయ‌న‌పై ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తంచేస్తున్న త‌రుణంలో.. ప‌వ‌న్ కీల‌కంగా మార‌వచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీలో రాజకీయం స‌రికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఏపీ రాజ‌కీయాలు.. అందులోనూ అనంత‌పురం రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారాయి. తాజాగా పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణంగా మారుతోంది. జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అనంతలో టీడీపీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలయ్యకు.. రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీ అవుతారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఇటీవల ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పీఏ కారణంగా తెలుగుదేశం శ్రేణుల్లో సమస్యలు పరిష్కరించని కారణంగా బాలయ్య పై ఆగ్రహం పెల్లుబుకు తోందనేందుకు ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనలే నిదర్శనం. అంతేగాక నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. దీనినే అనేక ప‌ద్ధ‌తుల్లో తెలియ‌జేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అనంత నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పాడు ప‌వ‌న్‌! దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏమై ఉంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య హ‌వానే న‌డిచేది.

ప‌వ‌న్ ఎంట్రీతో ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. జిల్లా అంత‌టా పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంద‌ని వివ‌రిస్తున్నారు. తద్వారా అనంతలో అధికార పార్టీలో కీలకంగా ఉన్న బాలయ్యకు గట్టిపోటీ ఇవ్వనున్నట్లు చెప్తున్నారు. మరోవైపు బాలయ్య రాజకీయ భవిష్యత్ పైనా కొత్త టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చునే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్య పోటీచేస్తే ప‌వ‌న్‌ గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం మాత్రం ఖాయం!!