” బాహుబ‌లి 2 ” ట్రైల‌ర్‌లో మిస్టేక్ ఇదే

ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది ఏదంటే వినిపించే ఒక్క‌టే మాట బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్‌. మ‌న తెలుగువాడు, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సినిమాకు కొన‌సాగింపుగా వ‌స్తోన్న బాహుబ‌లి 2 ట్రైల‌ర్ గ‌త 24 గంట‌లుగా యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. ఓ ఇండియ‌న్ సినిమా 24 గంట‌ల్లోనే ఏకంగా 2.20 కోట్ల వ్యూస్ సాధించి స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది.

అలాగే చాలా స్పీడ్‌గా 5 ల‌క్ష‌ల లైక్స్ కూడా బాహుబ‌లి 2 ట్రైల‌ర్ సొంతం చేసుకుంది. గ‌తేడాది రిలీజ్ అయిన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి ట్రైల‌ర్ కూడా కోటి వ్యూస్ మార్కు చేరుకునేందుకు చాలా టైం ప‌ట్టింది. అమీర్‌ఖాన్‌ దంగల్ చిత్రం ట్రైలర్ కూడా కోటి వ్యూస్ సాధించడానికే ఒక్క రోజు పట్టింది. అలాంటిది ఒక్క రోజులోనే బాహుబ‌లి 2 ట్రైల‌ర్ ఏకంగా 2.20 కోట్ల వ్యూస్ దాటేసి ఇంకా రేసుగుర్రంలా ప‌రిగెత్తుతోంది.

ఓ రేంజ్‌లో అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతోన్న బాహుబ‌లి 2 ట్రైల‌ర్‌లో ఓ త‌ప్పును మ‌నోళ్లు ప‌ట్టేశారు. ఎంతో గ్రాండియ‌ర్ విజువ‌ల్స్ ఉన్నా వ్యాక‌ర‌ణ దోషం త‌ప్పు ప‌ట్టుకున్నారు. ట్రైలర్‌లో కట్టప్పతో బాహుబలి డైలాగ్ ఒకటుంటుంది. ‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకు.. నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’’ అని డైలాగ్ చెబుతాడు అమరేంద్ర బాహుబలి. ఆ డైలాగ్‌లో వ్యాక‌ర‌ణ దోషాన్ని మ‌న భాషా పండితులు ప‌ట్టేశారు.

ఈ డైలాగ్‌లో ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకు..’ అనేది వ్యాకరణ పరంగా వర్తమానమని, ఆ తర్వాత వచ్చే వాక్యం ‘నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు..’ అనేది భూత(పాస్ట్) కాలం. అక్క‌డ డైలాగ్ అలా కాకుండా ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టబోడు మామా’ అని ఉండేలా రాయాల‌ని చెపుతున్నారు. అయితే ఇంత లోతుగా విశ్లేషించి త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని సాధార‌ణ జ‌నాలు, బాహుబ‌లి అభిమానులు సూచిస్తున్నారు.