అక్కడ బట్టలిప్పుకొని పనిచేయాలా?

దేశం కోసం ఉద్యోగులు ఎలా కష్టపడాలంటూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ దేశ ప్రజలు అపార్థం చేసుకున్నారు. అధినేత భావాన్ని అర్థం చేసుకోకుండా ఆయన అన్నమాటలను యథాతథంగా ఫాలో అయిపోయారు.

తూర్పు యూరప్ దేశమైన దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ అంటూ ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన భావాన్ని అర్థం చేసుకుండా ఆయన చెప్పిన మాటలను అక్షరాల అమలుచేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. సందేశంలోని సారాంశాన్ని పట్టించుకోకుండా బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలుతీసి మరి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఎడతెరపి లేకుండా పోస్ట్ చేస్తున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు..అయితే ఈ ఫొటోల్లో మగవాళ్లతోపాటు ఆడ ఉద్యోగులు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్‌లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే. కాకపోతే వారంతా తమ మానాన్ని రక్షించుకునేందుకు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకోవడం ఉన్నంతలో కాస్త మెరుగైన అంశం.

ఇది ఒక్క ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దుచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.‘బట్టలిప్పుకొని పనిచేయాలని మన దేశాధ్యక్షుడే చెబుతున్నారు’ లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమతో పాటు దేశాధ్యక్షుడు లుకషెంకో కూడా బట్టలిప్పుకొని పనిచేస్తున్నట్టు ఫొటోషాప్‌లో మార్పిడి చేసిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు లుకషెంకో ప్రస్తుతానికి అందుబాటులో లేరు.