స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీర్‌లో ఉన్న సక్సెస్‌ల గురించి.. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి.. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని తన అందం, అభినయం, మాట తీరుతో ఆకట్టుకున్న సమంత.. హీరోయిన్ గానే కాదు వ్యక్తిగతంగాను ఎంతో మందికి ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. సౌత్ ఇండియాతో పాటు.. నార్త్ ఇండియాలోను తన నటనతో పాపులారిటి దక్కించుకుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. సూపర్ స్టార్ స్టేటస్ ను తన ఖాతాలో వేసుకుంది.
అయితే గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్య కారణంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈమె.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను బాలీవుడ్ లో ప్రారంభించింది. అక్కడ పలు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించుకుంది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో నిర్మాతగాను మారింది సమంత. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ను స్థాపించి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే శుభం సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్లు కొత్తగా పెళ్లి చేసుకుని శోభనం గదిలోకి అడుగుపెట్టడం.. వీళ్లిద్దరి మధ్యన సంభాషణ.. హీరో అమాయకత్వం అర్థమయ్యేలా టీజర్ లో చూపించారు.
బెడ్ రూం లో హీరో మాట్లాడుతుండగా హీరోయిన్‌లో ఆకస్మాత్తుగా ఓ మార్పు రావడం హీరో గమనిస్తాడు. తను మాట్లాడుతుంటే హీరోయిన్ ఒక్కసారిగా కిందకు వెళ్లి కూర్చొని టీవీ ఆన్ చేసి తనకు నచ్చిన సీరియల్ చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హీరో మాట్లాడుతూ జీవితంలో మనకు ఎంతో ముఖ్యమైన ఘట్టం ఇది. ఇలాంటి టైంలో సీరియల్ చూస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ కోపంతో ఉష్ అని సైన్ చేస్తోంది. ఆ తర్వాత హీరోకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆమెలో దెయ్యం ఉందని. ఇక అమాయకమైన భర్త, దెయ్యం సోకిన భార్యతో ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా.. కామెడీ జోడించి.. హారర్ కామెడీ జానర్ లో చూపించనున్నారు.
అయితే ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంటాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే అది చాలాసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలోనే శుభం కూడా అలాంటి సక్సెస్ అందుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమా అయినా.. నటులు కొత్తవాళ్ళైనా.. కంటెంట్ బాగుంటే పెద్ద హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లు రాబడుతున్నాయి. వంద కోట్లలో వశూళ్ళు రాబడుతున్నాయి. కనుక సమంత ఈ సినిమాతో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. కుంభస్థలం బద్దలు కొట్టినట్టే.