హైదరాబాద్: ఆటిజం అనేది 21 రకాల వైకల్యాల్లో ఒకటి. ఈ వైకల్యం ఉన్న పిల్లలు చిన్న వయస్సులోనే సరైన సమయంలో గుర్తించబడితే, అవసరమైన థెరపీల ద్వారా వారి భవిష్యత్తును కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ స్థాయిలో సరైన సదుపాయాలు లేని పరిస్థితిని ఆసరాగా తీసుకొని, కావలసిన వనరులు, క్వాలిఫికేషన్స్, అనుమతులు లేని అక్రమ థెరపీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ అబిలిటీస్ అండ్ ఎల్డర్ వెల్ఫేర్ (DDEW) విభాగం మార్గదర్శకాలు పాటించకుండా, ఆటిజం, ADHD, స్పీచ్ డిలే వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నాసిరకం, మోసపూరిత థెరపీలు అందించడం వల్ల పిల్లల జీవితాలే ప్రశ్నార్థకమవుతూ, మంచి జరగక పోగా కీడు జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మా పిల్లలు ఈ సెంటర్లలో సరైన చికిత్స పొందితే వారి జీవితం బావుంటుందని నమ్మి అక్కడికి వెళ్ళాం, కానీ వాస్తవానికి ఈ అక్రమ థెరపీ సెంటర్లు వారి స్వార్ధానికి మా పిల్లల తిరిగిరాని విలువైన కాలాన్ని వృధా చేస్తూ ఉసురు పోసుకుంటున్నారని, ఇలాంటి సెంటర్లను తక్షణమే మూసివేయాలని, సరైన అనుమతులు ఉన్న సెంటర్లను మాత్రమే అనుమతించాలని కోరుతున్నాం” అని గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందిన ఒక తల్లి కన్నీరు పెట్టుకుంటూ పేర్కొంది.
అసలే వైకల్యంతో బాధపడుతున్న, చిన్నారుల జీవితాలతో, వారి తలిదండ్రుల, కుటుంబాలతో చెలగాటమాడుతున్నఈ అక్రమ థెరపీ సెంటర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ థెరపీ సెంటర్లను ప్రభుత్వం వెంటనే మూసి వేయాలని ప్రజలు తల్లిదండ్రులు, ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ఈ సెంటర్ల వల్ల మరింత ప్రాణ నష్టం జరుగుతుందని కూడా అంగవైకల్య బాధిత పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.