తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధినేత చెప్పిందే ఫైనల్. పార్టీ లైన్ దాటిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అయినా సరే… అధినేత చంద్రబాబు వెనుకడుగు వేయరనేది సీనియర్ నేతలకు బాగా తెలుసు. అయితే కొందరు జూనియర్ నేతల తీరు వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, పార్టీకి, అధినేత చంద్రబాబుకు కూడా చెడ్డ పేరు వస్తోంది. తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతలంతా ఇప్పటికీ పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటున్నారు. కానీ మధ్యలో వచ్చిన కొందరు నేతలు మాత్రం… అధినేత మాటను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న నేత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి వాసు తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ హవా తట్టుకుని మరీ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు. ఇందుకు స్థానికి కార్పొరేటర్లు, టీడీపీ నేతలు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఎంతో కృషి చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించారరు ఆదిరెడ్డి వాసు. అదే సమయంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అనుకూలంగా టీడీపీ నేతలనే వేధించారనేది బహిరంగ రహస్యం. మరోవైపు నేతలు, కార్యకర్తలంతా టీడీపీ గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే… వాసు మాత్రం… రూరల్, సిటీ అంటూ బార్డర్ లైన్ గీసేసి… ఇటు రావద్దు అంటూ రూల్ పాస్ చేసేశారు. దీంతో దాదాపు 15 మంది పైగా కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామా చేసేశారు.
మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే వైసీపీ నేతలతో ఇసుక అక్రమ వ్యాపారంలో ఆదిరెడ్డి వాసు భాగస్వామిగా ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక దశలో రాజంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో వాసు చర్చలు జరిపినట్లు కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే భార్య భవాని అడ్డుపడటంతో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆదిరెడ్డి వాసు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్‌తో కలిసి ఇసుక ర్యాంపు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గాయత్రి ర్యాంపు ఇసుక రీచ్‌లో గణేష్‌తో వ్యాపారం చేస్తున్న వాసు… కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానానికి మంగళం పాడేస్తున్నారు. పైకి మాత్రం ప్రతిరోజు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌పై విమర్శలు చేస్తున్న వాసు… లోపల మాత్రం రహస్య సంబంధాలు నిర్వహిస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధినేత చంద్రబాబుకు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా సరే నన్ను ఏం చేయలేరు మీరు అంటూ అక్రమ లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నారు ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అరాచకాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టకపోతే… రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుందని నేతలు భయపడుతున్నారు.